C. P. Radhakrishnan takes oath as 15th Vice-President of India | దేశ 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాధాకృష్ణన్ తో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతులు జగదీప్ ధనఖడ్, వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా జులై 21న వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయిన తొలి రోజు రాత్రి ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధనఖడ్ అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. సెప్టెంబర్ 9న జరిగిన ఉప ఎన్నికల్లో ఇండీ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్లతో ఎన్డీయే అభ్యర్థి అయిన సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు.
ఈ క్రమంలో తాజగా ఉపరాష్ట్రపతి బాధ్యతలను చేపట్టారు. అంతకంటే ముందు మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర బాధ్యతలను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు రాష్ట్రపతి అప్పగించారు.









