BSP Wins One Seat | బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) ఎన్డీఏ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కొన్ని ఆసక్తికర విజయాలు నమోదు అయ్యాయి. బిహార్ లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) కూడా పోటీ చేసింది.
మొత్తం 192 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ.. కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. అది కూడా కేవలం 30 ఓట్ల తేడాతో ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. బీఎస్పీ కి చెందిన సతీష్ కుమార్ యాదవ్ రామ్ గఢ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.
శుక్రవారం జరిగిన కౌంటింగ్లో ఇక్కడ పోరు హోరాహోరీగా కొనసాగింది. ఓట్ల లెక్కింపు సమయంలో సతీష్ ఎక్కువగా ఆధిక్యంలోనే నిలిచారు. రౌండ్ రౌండ్ కు ఆధిక్యత మారుతూ వచ్చింది. చివరికి 72,689 ఓట్లు సాధించిన సతీష్ యాదవ్ గెలుపొందారు. ఆయన ప్రత్యర్థిగా బీజేపీ నుంచి బరిలోకి దిగిన అశోక్ కుమార్ సింగ్ 72,659 ఓట్లను సాధించారు. దీంతో సతీశ్ యాదవ్ కేవలం 30 ఓట్ల తేడాతో విజయం సాధించారు.









