Friday 22nd November 2024
12:07:03 PM
Home > తాజా > తారాస్థాయికి చేరిన ఉచిత విద్యుత్ వివాదం…!

తారాస్థాయికి చేరిన ఉచిత విద్యుత్ వివాదం…!

Brs vs cong over free power

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉచిత విద్యుత్ పైన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆరెస్ పార్టీ రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.

రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కాంగ్రెస్ కూడా ఎదురుదాడికి దిగడంతో క్షేత్రస్థాయిలో బీఆరెస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీ నిరసనలు చేస్తున్నాయి.

బీఆరెస్ పార్టీ శ్రేణులతో మంత్రి కేటీఆర్ శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమాలు చేయాలో నిర్ణయించారు.

కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్తు రద్దే: కేటీఆర్

congress is against free power| కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా… కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ కావాలా తెలంగాణ రైతులు తేల్చుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

రాష్ట్రంలో ఉన్న 95 శాతం మంది రైతన్నలకు మూడు గంటల విద్యుత్ సరఫరా చాలు అంటూ… ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని మంత్రి కేటీఆర్ కోరారు.

కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే ఉచిత విద్యుత్తు రద్దు చేస్తుందన్న మాటను ప్రజాబాహుళ్యంలోకి మరింతగా తీసుకెళ్లాలని ఆయన కోరారు.

బీఆర్ఎస్ పార్టీ మూడు పంటలు కావాలా… కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు కావాలా అన్న నినాదంతో కదం తొక్కాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న తెలంగాణ రైతన్న బతుకులో చీకట్లు నింపే కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు చాలు అన్న వాదన ప్రతి గ్రామంలో, ప్రతి రైతు ఇంట్లో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్ అన్నారు.

రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతన్నల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకువచ్చేందుకు రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఎంతగానో పాటుపడుతుందని కేటీఆర్ తెలిపారు.

2001లో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు వ్యాఖ్యలను ప్రస్తావించిన కేటీఆర్, ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడే అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

అందుకే చంద్రబాబు రైతు, వ్యవసాయ వ్యతిరేక ఆలోచన విధానంతోనే ఉచిత విద్యుత్తుపైన అడ్డగోలుగా మాట్లాడారన్నారు.

రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలుగు కాంగ్రెస్, చంద్రబాబు కాంగ్రెస్ అన్న విషయాన్ని ప్రజలకు తెలియచెప్పాలన్నారు.

కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్తు రద్దు అవుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియచెప్పేలా 17వ తేదీ నుంచి పది రోజులపాటు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు.

ప్రతి రైతు వేదిక వద్ద కనీసం 1000 మంది రైతులకు తగ్గకుండా ఈ సమావేశాన్ని నిర్వహించాలని, ఈ సమావేశ నిర్వహణ బాధ్యతను స్వయంగా పార్టీ ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేయాలన్నారు.

ఒక ఎకరానికి ఒక గంట విద్యుత్ సరిపోతుందంటూ, 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతాంగాన్ని అవమానించడమే అని కేటీఆర్ తెలిపారు.

అందుకే కాంగ్రెస్ పార్టీ వెంటనే తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ రైతు సమావేశాల్లో తీర్మానం చేయాలన్నారు.

కటిక చీకట్ల కాంగ్రెస్ పార్టీ కావాలా, రైతు జీవితాల్లో కరెంటు వెలుగులు నింపిన బీఆర్ఎస్ కావాలా తెలుసుకోవాలని రైతులను కోరాలన్నారు మంత్రి కేటీఆర్.

You may also like
ktr vs revanth reddy
సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు: కేటీఆర్ సెటైర్లు!
ktr
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆగాలి.. ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్!
cm revath reddy
ఆరోగ్యంతో చెలగాటమాడితే సస్పెండ్
మా పోటీ ఆంధ్ర ప్రదేశ్ తో కాదు: సీఎం రేవంత్ రెడ్డి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions