Bilawal Bhutto threatens India | భారతదేశం పై మరోసారి పాకిస్థాన్ నేతలు పిచ్చి మాటలతో రెచ్చిపోతున్నారు. జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ ప్రాంతంలో మంగళవారం పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది మరణించారు.
ఈ తరుణంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. పహల్గాం ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో సింధూ నదీ జలాల పై 1960ల్లో కుదుర్చుకున్న ఒప్పందంపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ఉందనేది జగమెరిగిన సత్యం. ఈ క్రమంలో ఉగ్రదాడి అనంతరం సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇదే నిర్ణయం పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కారణం పాకిస్థాన్ వ్యవసాయం, తాగునీరు కోసం అధికంగా ఆదరపడేదే సింధూ నదిపై.
దేశ జీడీపీలో సుమారు 25% ప్రత్యక్షంగా, పరోక్షంగా సింధూ నదిపైనే ఆధారపడి ఉంది. దింతో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ దేశ రాజకీయ నేతల కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ అధినేత భిలావల్ భుట్టో జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సింధూ నదిలో ప్రతిచుక్క తమదేనని, భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందన్నారు. అంతేకాకుండా సింధూ నది పాక్ దే నని, సింధూ నాగరికతకు అసలైన వారసులు, సంరక్షకులం తామే అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా సింధూ నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుందని రెచ్చగొట్టారు.
కేవలం నేతలే కాకుండా పాకిస్థాన్ లో తలదాచుకున్న ఉగ్రవాది లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా భారత ప్రభుత్వం నిర్ణయం పై మాట్లాడడం గమనార్హం. కశ్మీర్ లో డ్యాములు నిర్మించి, పాక్ కు నీరు రాకుండా చేసే నాశనం చేయాలని భారత్ చూస్తోందని కానీ, నీళ్లు ఆపేస్తే మళ్ళీ సింధూతో పాటు ఇతర నదుల్లో రక్తం పారుతుందని బెదిరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.