Bhim Army Chief Azad | భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు, ఆ సంస్థకు అధ్యక్షడు, అంబేడ్కరైట్ అయిన చంద్రశేఖర్ ఆజాద్ పై హత్యాయత్నం జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని సహరన్ పూర్ జిల్లాలో బుధవారం సాయంత్రం భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు.
చికిత్స నిమిత్తం ఆజాద్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
భీమ్ ఆర్మీ చీఫ్ కారుపైకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయని, వాటిలో ఒకటి చంద్రశేఖర్ ఆజాద్ (Chandra Shekar Azad) కి తగిలినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి.
పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆజాద్ ఇలా అన్నాడు. “నాకు అంతగా గుర్తులేదు కానీ మా వాళ్ళు వారిని గుర్తించారు. వారి కారు సహరాన్‌పూర్ వైపు వెళ్లింది.
మేం యూ-టర్న్ తీసుకున్నాం. సంఘటన జరిగినప్పుడు మా తమ్ముడితో సహా ఐదుగురు కారులో ఉన్నాం” అని తెలిపాడు.
చంద్రశేఖర్ ఒక కార్యకర్త ఇంట్లో జరిగిన కార్యక్రమానిక హాజరయ్యేందుకు వెళ్లారు. ఆజాద్ తన ఎస్‌యూవీలో అక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఈ దాడి జరిగింది.
అంబేద్కరైట్ కార్యకర్త కాన్వాయ్‌పై కారులో వచ్చిన కొంతమంది సాయుధ వ్యక్తులు కాల్పులు జరిపారని సహరాన్‌పూర్ ఆసుపత్రి డాక్టర్ విపిన్ టాడా తెలిపారు.
“అరగంట క్రితం, చంద్ర శేఖర్ ఆజాద్ కాన్వాయ్‌పై కారులో ఉన్న కొంతమంది సాయుధ వ్యక్తులు కాల్పులు జరిపారు. అతడికి తగిలి బుల్లెట్ దూసుకెళ్లింది.
ప్రస్తుతం ఆజాద్ క్షేమంగా ఉన్నాడు. వైద్య చికిత్స కోసం సిహెచ్‌సికి తరలించారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు, ”అని అధికారి తెలిపారు.
వందలాది మంది భీమ్ ఆర్మీ మరియు ఆజాద్ సమాజ్ పార్టీ మద్దతుదారులు ఆసుపత్రి వద్ద గుమిగూడారు. దీంతో పోలీసు అక్కడ అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు.
భీమ్ ఆర్మీ చీఫ్, జాతీయ అధ్యక్షుడు భాయ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై సహరన్‌పూర్‌లోని దేవ్‌బంద్‌లో జరిగిన హంతక దాడి బహుజన మిషన్ ఉద్యమాన్ని ఆపే హేయమైన చర్య అని ఆయన అనుచరులు ఖండించారు.
నిందితులను తక్షణమే అరెస్టు చేసి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రశేఖర్ అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.