BCCI announces INR 58 crore cash prize for Team India | టీం ఇండియా ప్లేయర్లకు భారీ నజరానా ప్రకటించింది బీసీసీఐ. 12 ఏళ్ల తర్వాత టీం ఇండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ( Icc Champions Trophy )ని గెలిచిన విషయం తెల్సిందే.
ఈ క్రమంలో భారత ఆటగాళ్లు ప్రతిభకు గౌరవంగా రూ.58 కోట్ల నజరానా ప్రకటిస్తున్నట్లు బీసీసీఐ గురువారం ఓ ప్రకటన జారీ చేసింది. కేవలం సంవత్సరం గడువులోనే టీం ఇండియా రెండు ఐసీసీ ట్రోఫీలను సాధించి చరిత్ర సృష్టించింది.
2024లో ఐసీసీ టీ-20 వరల్డ్ కప్, 2025 లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల, కోచింగ్, సపోర్ట్ స్టాఫ్ శ్రమకు గుర్తుగా నజరానాను ఇస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. రోహిత్ శర్మ నేతృత్వంలో టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం ఆధిపత్యం కనబరిచిన విషయాన్ని మరోసారి గుర్తుచేసింది.
బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో గెలిచిన టీం ఇండియా ఆ తర్వాత పాకిస్థాన్, న్యూజీలాండ్ ను చిత్తుచేసింది. సెమి ఫైనల్స్ లో ఆస్ట్రేలియా ను మట్టికరిపించి దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్స్ లో కివీస్ ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది.
అంతర్జాతీయ వేదికపై భారత క్రికెట్ ఉన్నతస్థానాలకు దూసుకెళ్తుందని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ పేర్కొన్నారు. కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత్ కు రూ.19.50 కోట్ల ఐసీసీ ప్రైజ్ మనీ లభించింది. ఇప్పుడు బీసీసీఐ ఏకంగా రూ.58 కోట్ల రివార్డును ప్రకటించింది.