Bandi Sanjay On HCU Lands | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకు సమీపంలో కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే ఈ నిర్ణయం పట్ల యూనివర్సిటీ విద్యార్థులు భగ్గుమంటున్నారు. అలాగే బీజేపీ, బీఆరెస్ నాయకులు ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కంచ గచ్చిబౌలి భూమి విక్రయం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అత్యంత అవకాశవాద చర్య అని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయడానికి ప్లాన్ చేసిన 400 ఎకరాలు అటవీ పరిధి కిందకు వస్తాయని, అటవీ లక్షణాలు ఉన్న ఏ భూమినైనా కేంద్రం అనుమతి లేకుండా నరికివేయకూడదని సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయని గుర్తుచేశారు.
అలాగే 400 ఎకరాల భూమి వివాదానికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తుందని, ప్రభుత్వాన్ని ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయమని న్యాయస్థానం ఆదేశించిందని పేర్కొన్నారు. అయినప్పటికీ, ప్రభుత్వం కోర్టును ధిక్కరిస్తూ, చెట్లను నరికివేస్తూ, పర్యావరణాన్ని నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం BRS కంటే దారుణమని అక్రమ అటవీ నిర్మూలన మరియు వేలం ద్వారా వేల కోట్లు దోచుకోవడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.
ముఖ్యమంత్రి స్వయంగా ఒకప్పుడు ఇటువంటి భూమి విక్రయాలను వ్యతిరేకించలేదా? అని ప్రశ్నించారు. ధనవంతుల కోసం ఫ్యూచర్ సిటీ, భవిష్యత్ తరాలకు లాఠీలు — ఇదేనా కాంగ్రెస్ మోడల్? అని నిలదీశారు. వేలం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేకపోతే ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.