లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ ।
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్ ।।
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప।।
Ayyappa Deeksha Rules | సకల చరాచర విశ్వంలో భగవంతుడు సృష్టించిన వాటిలో అత్యున్నతమైనది మానవ జన్మ. అన్ని జీవరాశుల్లోకెల్ల బుద్ధికుశలత ఉన్న జీవి మనిషి. ప్రకృతితోపాటు సకల పశుపక్ష్యాదులను రక్షించాల్సిన బాధ్యత మనిషిపై ఉంది.
పవిత్రమైన మనిషి జన్మను భగవంతుడు ప్రసాదించినప్పుడు ఆ అవకాశాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. నీతి, నిజాయతీ, కట్టుబాట్లు పాటిస్తూ మనిషి కనీస ధర్మాలను ఆచరించాలి. నిత్యం భగవన్నామ స్మరణ చేస్తూ సృష్టి, స్థితి, లయ కారకుణ్ని ఆరాధించాలి.
మాధవ సేవతోపాటు మానవ సేవతో మోక్షాన్ని పొందాలి. అలాంటి అత్యుత్తమమైన మార్గాన్ని అనుసరింపజేసే ఆధ్యాత్మక భావన అయ్యప్ప మాల. అయ్యప్ప కథ ప్రగాఢమైన భక్తి, ధైర్యం మరియు ఆధ్యాత్మిక క్రమశిక్షణతో కూడినది. ఇది తరతరాలుగా సంక్రమించిన కథ.
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను ధర్మం మరియు స్వీయ నియంత్రణ మార్గంలో నడవడానికి ప్రేరేపించింది అయ్యప్ప చరిత్ర. ధర్మ రక్షకుడిగా పిలువబడే అయ్యప్ప, శివుడు మరియు విష్ణువు యొక్క స్త్రీ రూపమైన మోహిని యొక్క కుమారుడు. స్వామి పుట్టుక, జీవితం, లక్ష్యం మంచి మరియు చెడుల మధ్య శాశ్వతమైన పోరాటానికి ప్రతీక.
అయ్యప్ప యొక్క అంతిమ లక్ష్యం ఆధ్యాత్మిక విముక్తి సాధనలో అన్ని విశ్వాసాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం. హరిహరపుత్రుడి కథ ద్వారా, భక్తి, త్యాగం మరియు ఐక్యత యొక్క శక్తిని మనం గ్రహిస్తాం. అయ్యప్ప మాలకు సంబంధించిన అత్యంత పవిత్రమైన ఆచారాలలో అయ్యప్ప మహా పడి పూజ ఒకటి.
ఈ ఆధ్యాత్మిక వేడుక శబరిమల మందిరంలో అయ్యప్పను చేరుకోవడానికి భక్తులు ఎక్కే 18 మెట్లు లేదా పడి వేడుక. 18 మెట్లు సత్యం, జ్ఞానం మరియు భక్తి వంటి వివిధ ఆధ్యాత్మిక సూత్రాలను సూచిస్తాయి. వాటిని అధిరోహించడం జ్ఞానోదయం వైపు భక్తుని ఆధ్యాత్మిక పురోగతిని సూచిస్తుంది.
యాత్రికుల ప్రయాణం ముగింపుకు గుర్తుగా ఈ పవిత్ర దశలను గౌరవించేందుకు మహా పడి పూజ నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా అయ్యప్ప దీక్ష తీసుకునే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే చాలా మంది మాల ధారణ చేసి, అయ్యప్ప దీక్షను పాటిస్తున్నారు.
అయ్యప్ప దీక్ష అంత్యంత పవిత్రమైనది మరియు చాలా కఠినమైనది. కేరళలోని శబరిమలలో కొలువైన అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు మండల కాలంపాటు అంటే 41 రోజులు కఠిన దీక్ష తీసుకుని ఇరుమడి కట్టుకుంటారు. మాలధారణ చేసిన స్వాములు 41 రోజులపాటు అత్యంత నియమ నిష్టలతో అయ్యప్పను పూజిస్తారు. ఈ 41 రోజుల దీక్షా సమయంలో అయ్యప్ప మాలధారులు ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి.
- కార్తీక మాసం శుక్ల పాడ్యమి నాడు ప్రారంభించి, దీక్షాకాలం కనీసం 41 రోజులకు తక్కువ కాకుండా ఉండేలా చూసుకోని, ఒక మంచి రోజు గురుస్వామి ద్వారా 108 పూసలు గల తులసి లేదా రుద్రాక్ష మాలను ధరించాలి.
- మాల ధరించడానికి కనీసం మూడు రోజుల ముందు నుంచే పవిత్రంగా ఉండాలి. మద్యం, మాంసం తినరాదు.
- దీక్షా సమయంలో అల్లం, వెల్లుల్లి కూడా లేని పూర్తి సాత్వికాహారం ఆరగించాలి. మధ్యాహ్నం 3 గంటల లోపే భిక్ష పూర్తి చేయాలి. సాయత్రం పూజ అనంతరం అల్పాహారం తీసుకోవాలి.
- గురుస్వామికి విధేయుడై గురుస్వామి చెప్పినట్లుగా దీక్ష నియమాలు పాటించాలి.
- మాల ధరించిన స్వాములంతా నిత్యం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, చన్నీటి స్నానమాచరించి, సూర్యోదయం కాకముందే పూజను ముగించాలి. తిరిగి సాయంత్రం చన్నీటి స్నానం చేసి సంధ్యాపూజ చేయాలి.
- స్నానం చసిన తర్వాత విభూతి, చందనం, కుంకుమ బొట్లు ధరించాలి. గణపతిని, షణ్ముఖుడిని, కులదైవాన్ని తదితరులను పూజించిన తర్వాత 108 సార్లు అయ్యప్ప శరణుఘోష పలకాలి. తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి. నైవేద్యంగా ఫలాదికాలను సమర్పించాలి.
- దీక్షాకాలంలో నలుపు, నీలం, కాషాయం రంగు దుస్తులను ధరించాలి. నలుపు రంగు దుస్తులు ధరించడం సంప్రదాయం. ప్రతి రోజూ కనీసం ఒక్కసారైనా అయ్యప్ప స్వామి ఆలయానికి లేదా ఇతర దేవాలయానికి వెళ్లాలి.
- చెప్పులు ధరించకూడదు. ధూమపానం, మద్యపానం చేయకూడదు. ఇతర మత్తు పదార్థాలు, తాంబూలాలు తినొద్దు. దీక్షాకాలంలో జుట్టు, గడ్డం, గోర్లు కత్తిరించుకోకూడదు.
- పగటిపూట నిద్రించకూడదు. రాత్రి మంచంపై నిద్రించవద్దు. చాపగానీ, తుండుగుడ్డ గానీ పరుచుకొని పడుకోవాలి. తలదిండు ఉపయోగించకూడదు. నిద్రించేటప్పుడు, పాద నమస్కారం చేసేటప్పుడు మెడలో ఉన్న మాల నేలకు తాకకుండా జాగ్రత్త తీసుకోవాలి.
- స్వామి శరణు ఘోష ప్రియుడు కాబట్టి నిరంతరం భజనల్లో పాల్గొనాలి. దీక్ష సమయంలో హోదా, వయస్సు, పేద, ధనిక తేడా లేకుండా అయ్యప్ప స్వాములందరికీ పాదాభివందనం చేయాలి. తల్లిదండ్రులు మినహా దీక్షలోలేనివారికి పాదాభివందనం చేయకూడదు.
- స్వాములు చేసే దీక్ష, పూజ, భుజించే భిక్ష, నిద్ర సృష్టి ప్రమాణానికి అనుకూలంగా ఉండాలి. భజన, పూజ సమయంలో తడి దుస్తులు ధరించకూడదు. చొక్కా ధరించకూడదు. అంగ వస్త్రాన్ని నడుముకు చుట్టుకోవాలి.
- అశుభకార్యాల్లో పాల్గొనవద్దు. అత్యవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకూడదు. దీక్షలో ఉండగా రక్తసంబంధీకులు, దగ్గరి బంధువులు, దాయదులు మరణిస్తే మాలను విసర్జింపజేయాలి.
- భిక్ష ఎవరైనా శుభ్రంగా తయారు చేసి పెట్టొచ్చు. అయ్యప్ప అన్నదాన ప్రియుడు కాబట్టి కనీసం ముగ్గురికైనా భిక్ష పెట్టడం ఉత్తమం. వీలు కాకపోతే ధాన్యాన్ని కొంతమందికి పంచవచ్చు. కనీసం మూడుసార్లైనా ఇతరుల ఇంటికి భిక్షకు వెళ్లాలి.
- దీక్షాకాలంలో బ్రహ్మచర్యాన్ని కఠినంగా పాటించాలి. స్త్రీలను కామవాంఛతో చూడకూడదు. మనసులో కూడా అలాంటి ఆలోచనలు రానివ్వకూడదు. వినోద కార్యక్రమాలకు, జూదానికి దూరంగా ఉండాలి. సినిమాలు, నాటకాలు చూడకూడదు.
- పదేళ్ల లోపు ఆడపిల్లలు, రుతుకాలం తీరిన అంటే సుమారు 50 ఏళ్లు పైబడిన స్త్రీలు మాత్రమే అయ్యప్ప మాల ధరించాలి.
- శబరిగిరికి ప్రయాణమైనప్పుడు ‘పోయి వస్తాను’ అని చెప్పకూడదు. స్వామి శరణం అని చెప్పాలి. శబరిగిరిలో అయ్యప్ప భక్తులు పంబా నదిలో స్నానం చేసేటప్పుడు వంశంలోని పెద్దవారి పేర్లను స్మరించి వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకోవాలి.
- శబరిగిరి యాత్రకు ఇరుముడి తీసుకొని బయలుదేరిన వారు రెండు పూటలా స్నానం ఆచరించి, స్వామి వారి పటాలకు, ఇరుముడులకు హారతి ఇవ్వాలి. శరణములు చెప్పాలి.
- శబరిగిరి యాత్ర ముగిసిన తర్వాత అభిషేక ప్రసాదంతో ఇంటికి వచ్చి సన్నిదానం కదిపిన తరువాతనే మాల విసర్జన మంత్రాన్ని చెప్పుకొని గురుస్వామి లేక కన్నతల్లితో మాల విసర్జన చేసి దీక్షను ముగించాలి.