Ayodhya Ramalayam Updates | అయోధ్య శ్రీరామజన్మభూమిలో ఇటీవల ప్రతిష్టించిన రామ మందిరాన్ని దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున సందర్శిస్తున్నారు. జనవరి 22న బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగినప్పటి నుంచి నేటి వరకు రోజుకు సగటున లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు దర్శించుకుంటున్నారు. దీంతో భక్తుల రద్దీ నేపథ్యంలో తాజాగా శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ మార్గదర్శకాలను వెలువరించింది.
రామభక్తుల సౌకర్యార్థం ఆలయం దర్శన సమయాన్ని పొడిగించింది. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకూ దర్శనాలకు అనుమతిస్తున్నట్టు తెలిపింది. రాత్రి 10 గంటలకు శయన హారతితో దర్శనాలు ముగుస్తాయని పేర్కొంది.
సాధారణంగా 60 నుంచి 75 నిమిషాల్లోపు బాల రాముడి దర్శనం పూర్తవుతుందని తెలిపింది. భక్తులు మొబైల్ ఫోన్లు, చెప్పులు, పర్సులు మొదలైన వాటిని మందిరం ప్రాంగణం వెలుపలే ఉంచాలని విజ్ఞప్తి చేసింది… పుష్పాలు, దండలు, నైవేద్యం మొదలైనవాటిని తీసుకురావద్దని కోరింది.
ఉదయం 4 గంటలకు మంగళహారతి, ఉదయం 6.15 గంటలకు శృంగార హారతి, రాత్రి 10 గంటలకు శయన హారతి ఉంటాయని ఆలయ ట్రస్ట్ వెల్లడించింది. రాత్రి హారతికి మాత్రం ఎంట్రీ పాస్‌లు ఉండాలని పేర్కొంది. ఈ పాస్‌ల కోసం భక్తుల తమ పేరు, వయసు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్లు, నగరం సహ వివరాలను అందజేయాల్సి ఉంటుందని చెప్పింది.
పాస్‌లను శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఉచితంగా పొందవచ్చని తెలిపింది. ఆలయంలో ప్రత్యేక దర్శనాలకు ఎటువంటి ఏర్పాట్లు, ప్రత్యేక పాస్ లు లేవనీ వివరించింది. ఒకవేళ దర్శనం కోసం డబ్బులు తీసుకుంటున్నట్టు వింటే అది బోగస్‌గా భావించాలని భక్తులకు సూచించింది.
దివ్యాంగులు, వయోవృద్ధులకు వీల్‌ఛైర్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. వాటిని నడిపేందుకు సహకరించే యువ వాలంటీర్ల కోసం నామమాత్రపు ఫీజు మాత్రం ఇవ్వాల్సి ఉంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.