Pawan Comments on Sandhya Theatre Incident | సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, సినీనటుడు అల్లు అర్జున్ (Allu Arjun Arrest) అరెస్ట్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు.
మంగళగిరిలో మీడియాతో చిట్ చాట్లో ఆయన మాట్లాడుతూ సంధ్య థియేటర్ ఘటనలో గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారని వ్యాఖ్యానించారు.
ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం తనను కలచి వేసిందన్నారు. ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ తరపున ఎవరో ఒకరు బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
తామంతా అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సిందన్నారు పవన్. అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సిందనీ, పరామర్శించకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చిందని తెలిపారు.
“తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన అర్జున్ ఉంది. సినిమా అంటే టీమ్. అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చడం కూడా కరెక్ట్ కాదు. ఘటనపై సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయి.
చిరంజీవి కూడా గతంలో అభిమానులతో కలిసి సినిమాలు చూసేందుకు వెళ్లేవారు. కాకపోతే ఆయన ముసుగు వేసుకుని ఒక్కరే థియేటరు వెళ్లేవారు.” అని డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు.