Andole Sentiment Repeat | తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధోల్ (Andole) నియోజకవర్గం నుండి నాలుగో ఎమ్మెల్యేగా గెలుపొందారు మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనరసింహ.
తాజాగా గురువారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే రాజనర్సింహ గెలుపునకు, కాంగ్రెస్ విజయానికి ఓ అవినాభావ సంబంధం ఉంది.
సుమారు 34 ఏండ్ల నుండి ఓ సెంటిమెంట్ రిపీట్ అవుతోంది. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రతిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆయన ఓడిపోయిన ప్రతిసారి కాంగ్రెస్ కూడా అధికారానికి దూరం అయ్యింది.
తండ్రి మరణాంతరం 1989 లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు దామోదర రాజనరసింహ. 1989 ఆంధోల్ నుండి MLA గా గెలిచారు రాజానరసింహ. 1989 లో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది. కాగా 1994, 1999 ఎన్నికల్లో ఆంధోల్ లో రాజనరసింహ ఓడిపోగా ఆ రెండు పర్యాయాలు కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉంది.
తిరిగి 2004, 2009 లో ఎమ్మెల్యే గా విజయం సాధించారు ఈ నేత. యాదృచ్ఛికంగా కాంగ్రెస్ కూడా అధికారం చేపట్టింది. అప్పుడు డిప్యూటీ సీఎం గా సేవలందించారు రాజనర్సింహ. అనంతరం 2014, 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోగా కాంగ్రెస్ కూడా 10 ఏళ్ల పాటు ప్రతిపక్షం లో కూర్చుంది.
కానీ 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఆంధోల్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు రాజనరసింహ. ఈసారి కూడా సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. దామోదర రాజనర్సింహ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.