Mayday Call | గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలు దేరిన ఎయిరిండియా విమానం మధ్యాహ్నం 1 గంట 38 నిమిషాలకు టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే మేఘాని నగర్ లోని ఓ మెడికల్ కాలేజీ భవనం మీద కూలిపోయింది. దీంతో ఆ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన నల్లటి పొగ అలుముకుంది.
ప్రమాద సమయంలో మొత్తం 230 మంది ప్రయాణీకులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే విమానం కూలిపోయే ముందు పైలట్ల నుంచి మేడే కాల్ (Mayday Call) వచ్చినట్లు పౌర విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఏటీసీ తిరిగి పైలట్లను సంప్రదించడానికి ప్రయత్నించగా, అటు నుంచి రెస్పాన్స్ లేదని తెలిపారు. తర్వాత కొద్ది క్షణాల్లోనే విమానం కూలిపోయింది.
మేడే కాల్ అనేది డిస్ట్రెస్ కాల్. తాము అత్యవసర ప్రమాద పరిస్థితుల్లో ఉన్నామని రేడియో కమ్యూనికేషన్ ద్వారా దగ్గర్లోని ఏయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు తెలుపుతారు. ఎమర్జెన్సీ సమయాల్లో పైలట్లు మేడే అని మూడుసార్లు చెబుతారు. తాము ఆపదలో ఉన్నాం.. తక్షణ సాయం అవసరం అని దీని అర్థం. ఇది ఫ్రెంచ్ పదం మైడేర్ నుంచి వచ్చింది. సాయం చేయండి అని దీనర్థం.