Pawan Kalyan Orders Probe Into KGH Stillbirth Allegation | విశాఖపట్నం కేజీహెచ్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా గర్భంలోనే తన శిశువు మృతి చెందిందని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. బాధిత మహిళను కుటుంబంతో సహా సోమవారం రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయానికి వెంటబెట్టుకుని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి విశాఖ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా విమానాశ్రయంలో పట్నాల ఉమాదేవి అనే మహిళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిశారు. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో కాన్పు నిమిత్తం కేజీహెచ్ లో చేరగా.. వైద్యులు, సిబ్బంది తన పట్ల, తన కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా, ఎంతో అమానవీయంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు.
కాన్పుకి ఇచ్చిన గడువు పూర్తయ్యిందని తెలిపినప్పటికీ సాధారణ కాన్పు పేరిట నరకం చూపించారని, తన పరిస్థితి అందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు పదేపదే చెప్పినా వినిపించుకోలేదని తెలిపారు. పైగా తన కుటుంబ సభ్యులను తీవ్ర పదజాలంతో దూషించారని, కాన్పు సమయంలో తన గుండెల పైకి ఎక్కి కూర్చుని సాధారణ కాన్పు పేరిట అమానవీయంగా ప్రవర్తించారని వాపోయారు. చివరి నిమిషం వరకు సిజేరియన్ నిర్ణయం తీసుకోకపోవడం కారణంగా మృత శిశువుకి జన్మనివ్వాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. కేజీహెచ్ సిబ్బంది తీరుతో శారీరక హింసతో పాటు జీవితకాలం మనో వేదన మిగిలిందంటూ గోడు వెళ్లబోసుకున్నారు. తన లాంటి దుస్థితి మరో మహిళకు రాకుండా వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఈ క్రమంలో బాధిత మహిళను మరియు ఆమె కుటుంబాన్ని సచివాలయానికి తీసుకురావాలని పవన్ అధికారుల్ని ఆదేశించారు.









