SIT Notice To KCR | ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు బీఆరెస్ అధినేత కేసీఆర్ కు గురువారం నోటీసులు జారీ చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భగ్గుమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ‘తెలంగాణ జాతి పిత కేసీఆర్ పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ ని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే, రేవంత్’ అంటూ హరీష్ హాట్ కామెంట్స్ చేశారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని పేర్కొన్నారు. అలాంటి నాయకుడిపై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమే అని తెలిపారు.
పరిపాలనలో చేతకానితనంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట అని కన్నెర్ర చేశారు. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. ఈ సమయంలో తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వెంటే ఉందని రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.









