Home Minister Anitha Praises Constable Jayashanti | విధి నిర్వహణలో లేకపోయినా చంకన బిడ్డతో ట్రాఫిక్ ను క్లియర్ చేసిన కానిస్టేబుల్ జయశాంతి గురువారం హోంమంత్రి అనితను కలిశారు. ఈ క్రమంలో జయశాంతిని హోంమంత్రి సత్కరించారు. సంక్రాంతి పండుగ సమయంలో కాకినాడ కెనాల్ రోడ్డులో ఇటీవల భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. విధి నిర్వహణలో లేకపోయినప్పటికీ చంకలో చంటిబిడ్డను ఎత్తుకుని రంగంపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ జయశాంతి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అలాగే ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్సుకు దారి ఇచ్చేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం జయశాంతికి ఫోన్ చేసి అభినందించారు హోంమంత్రి అనిత. ఈ సందర్భంగా, మంత్రిని కలవాలనుందని జయశాంతి కోరారు. దింతో విజయవాడ క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో వచ్చిన జయశాంతిని కలిశారు మంత్రి. ఆమెతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం జయశాంతిని సత్కరించారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే మహిళా పోలీసులంటే తనకు ఎప్పుడూ ప్రత్యేక గౌరవం ఉంటుందన్నారు హోంమంత్రి. రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి పోలీస్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.









