CM Revanth Medaram Visit | ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం మహా జాతర (Medaram Jathara) అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా అత్యంత వైభవంగా పునర్నిర్మించిన సమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భక్తులకు అంకితం చేశారు.
ఆదివారం రాత్రి మేడారంలో బస చేసిన ముఖ్యమంత్రి, పునర్నిర్మాణ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మొదట అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం కుటుంబ సమేతంగా వన దేవతలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తన మనవడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తులాభారంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తన బరువుకు సమానమైన 68 కిలోల బెల్లం వనదేవతలకు సమర్పించారు. అనంతరం సీఎం రేవంత్ నేరుగా దావోస్ పర్యటనకు వెళ్లారు.
మేడారం అభివృద్ధిలో భాగంగా నాలుగు వేల టన్నుల గ్రానైట్‌తో నిర్మాణాలు చేపట్టి, ఆదివాసీ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా 7 వేల శిల్ప చిత్రాలను చెక్కారు. గద్దెల ప్రాంగణాన్ని 46 పిల్లర్లు, విశాల స్వాగత తోరణాలతో చారిత్రక కట్టడాల తరహాలో తీర్చిదిద్దారు.
గోడలపై కోయ వంశీయుల చరిత్రను ప్రతిబింబించే శిల్పాలు, ప్రధాన తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపే 59 బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.









