Bandla Ganesh Padayatra To Tirumala | నిర్మాత బండ్ల గణేశ్ షాద్ నగర్ లోని తన నివాసం నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. సోమవారం ఉదయం ‘సంకల్ప యాత్ర’ పేరుతో ఈ పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు గణేశ్ ప్రకటించారు. వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టైన విషయం తెల్సిందే. ఆ సమయంలో చెరసాల నుంచి చంద్రబాబు బయటకు రావాలని శ్రీవారిని మొక్కుకున్నట్లు, ఈ క్రమంలో మొక్కు తీరుచుకునేందుకు ఈ పాదయాత్రను చేపట్టనున్నట్లు బండ్ల పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
‘దేశం గర్వించే దార్శనికుడు చంద్రబాబు మీద వేసిన అభాండాలు తొలిగిపోవాలని, ఆయన చెరసాల నుంచి బయటికి రావాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గడప మీద నిలబడి మొక్కుకున్న మొక్కు “నా గడప నించి నీ కొండ దాకా పాదయాత్ర” చేసి వస్తా అని. ఈ రోజు తెలుగు వారి ఇలవేల్పు ఏడుకొండలస్వామి ఆశ్శీస్సులతో, ప్రతి తెలుగు వాడి ప్రార్థనలతో చంద్రబాబు మళ్లీ అఖండ విజయంతో పూర్వ వైభవాన్ని సాధించుకున్నారు. ఇటీవలే కేసులు అన్నీ కొట్టేశారు. నా మనసు కుదుటపడింది. నా కుటుంబ మొక్కు గుర్తుతెచ్చుకుంది. ఇంకా నా గడప నన్ను అడుగుతోంది మొక్కుబడి తీర్చుకోమని. శేషాచలం కొండ పిలుస్తోంది వచ్చి దర్శించుకోమని. అందుకే అమ్మ నాన్నల ఆశీర్వాదాలతో..ఈ నెల 19వ తేదీన ఉదయం 9 గంటలకు షాద్నగర్ మా ఇంటి గడప ముందు కొబ్బరి కాయ కొట్టి పాదయాత్ర మొదలెట్టి ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో కొండకి చేరి ఏడుకొండలవాడి దర్శనం చేసుకోవడం సంకల్పం. ఇది రాజకీయ యాత్ర కాదు. నా మనోవేదన తీర్చిన, నా కోరిక నెరవేర్చిన, నా మాట ఆలకించిన ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామికి నా మొక్కుబడి చెల్లింపు’ అని బండ్ల గణేశ్ పేర్కొన్నారు.









