Manoj Tiwari questions Rohit Sharma’s captaincy removal | టీం ఇండియా దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మను వన్డే ఫార్మాట్ కెప్టెన్ గా తొలగిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం విస్తృత చర్చకు దారి తీసింది. ఈ సంచలన నిర్ణయం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో రోహిత్ శర్మను కెప్టెన్ గా తొలగించాలనే నిర్ణయం వెనుక బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కార్, టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ ప్లేయర్ మనోజ్ తివారీ. రోహిత్ ను తప్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది అగర్కార్, అయినప్పటికీ ఈ నిర్ణయం వెనుక గంభీర్ కచ్చితంగా ఉండేఉంటారని తివారీ పేర్కొన్నారు. ఈ మేరకు తాజగా ఓ టీవీ ఇంటర్వ్యూలో మనోజ్ తివారీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
టీ-20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో టీం ఇండియాను విజేతగా నిలిపిన రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పించడం సరైన నిర్ణయం కాదని, ఇది రోహిత్ ను అవమానించడమే అని అన్నారు. అజిత్ అగర్కార్ కఠిన నిర్ణయాలు తీసుకుంటారని, కానీ రోహిత్ శర్మకు కెప్టెన్ గా తప్పించేంత సాహసం చేయగలరా అని అనుమానం వ్యక్తం చేశారు. గౌతమ్ గంభీర్ సూచనల ప్రభావం మేరకే అగర్కార్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2027 వరల్డ్ కప్ వరకు ఆడగలిగే సత్తా రోహిత్ శర్మ సొంతం అని పేర్కొన్న మనోజ్, రోహిత్ ను తప్పించి శుభమన్ గిల్ కు సారథిగా నియమించడం సబబు కాదన్నారు. ప్రస్తుతం మనోజ్ తివారీ చేసిన కామెంట్స్ పై అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఐపీఎల్ లో భాగంగా కోల్కత్త తరఫున గతంలో గంభీర్ సారథ్యంలో మనోజ్ తివారీ ఆడారు.









