Govt urges qcom firms to drop ’10-minute delivery’ | కేంద్రప్రభుత్వ జోక్యంతో క్విక్ కామర్స్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వర్కర్లను తీవ్ర ఒత్తిడికి గురి చేసే 10 నిమిషాల్లోనే డెలివరీ నిబంధనను నిలిపివేసేందుకు క్విక్ కామర్స్ సంస్థలు సిద్ధం అయ్యాయి. ఇప్పటికే బ్లింకిట్ ఈ సేవలను నిలిపివేసేందుకు సిద్ధం అయ్యినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇకపోతే జెప్టో, స్విగ్గి ఇన్స్టామార్ట్ కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ సేవలను నిలిపివేయనున్నాయి. గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ క్విక్ కామర్స్ సంస్థలకు చెందిన కార్మికులు సమ్మె చేశారు.
ఇందులో 10 నిమిషాల డెలివరీని రద్దు చేయాలనేది వారి ప్రధాన డిమాండ్. అలాగే వర్కర్ల భద్రత, రక్షణ, మెరుగైన పరిస్థితులను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మె నేపథ్యంలో మంగళవారం న్యూ ఢిల్లీలో కేంద్రమంత్రి మనసుఖ్ మాండివీయ బ్లింకింట్, జెప్టో, స్విగ్గి ప్రతినిధులతో భేటీ అయి 10 నిమిషాల డెలివరీ సెవల్ని నిలిపివేయాలని స్పష్టం చేశారు. ఇందుకు ఆ సంస్థలను ఒప్పించారు. కేంద్రప్రభుత్వ సూచనల మేరకు సదరు సంస్థలు 10 నిమిషాల డెలివరీ సేవల్ని నిలిపివేయనున్నాయి.









