India responds to Asim Munir’s remarks in US | పాకిస్థాన్ ఆర్మి చీఫ్ అసీం మునీర్ మరోసారి భారత్ పై అణు బెదిరింపులకు పాల్పడ్డాడు.
అమెరికా పర్యటనలో ఉన్న అతడు ఒకవేళ భారత్ నుంచి పాకిస్థాన్ కు ప్రమాదం ఎదురైతే తమతో పాటు సగం ప్రపంచం నాశనం చేస్తామంటూ నోరుపారేసుకున్నాడు. తమది అణ్వాయుధ సామర్థ్యం గల దేశమని చెప్పాడు. ఈ నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది. అసీం మునీర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
పాకిస్థాన్ కు అణు బెదిరింపులు అలవాటే అని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సోమవారం ప్రకటన విడుదల చేసింది. మునీర్ వ్యాఖ్యలు పాకిస్థాన్ యొక్క బాధ్యతారహిత వైఖరిని మరియు అణ్వాయుధాలపై నియంత్రణ లేని విధానాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది.
అమెరికా గడ్డపై నుంచి ఇలాంటి బెదిరింపు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, అమెరికా మద్దతుతో పాకిస్థాన్ ఎప్పుడూ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిందని ప్రకటనలో విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజానికి పాకిస్థాన్ యొక్క దుర్మార్గపు వైఖరిని బహిర్గతం చేస్తాయని, అణ్వాయుధాలు ఎవరి నియంత్రణలో ఉన్నాయో స్పష్టమవుతోందని విదేశాంగ శాఖ తెలిపింది.
పాకిస్థాన్ సైన్యం తీవ్రవాద ముఠాలతో సంబంధాలు కలిగి ఉందని, ఇలాంటి బెదిరింపులు దానికి నిదర్శనమని వెల్లడించింది. అణు బెదిరింపులకు భయపడేదే లేదని, దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలకైనా సిద్ధమే అని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటనలో తేల్చి చెప్పింది.









