Ys Jagan Warns Cm Chandrababu | పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, రౌడీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.
నల్లగొండువారిపల్లె వద్ద ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సహా, వేముల మండల పార్టీ పరిశీలకుడు వేల్పుల రామలింగారెడ్డిపై టీడీపీ వాళ్లు హత్యాయత్నానికి దిగారని ఆరోపించారు. ఈ ఘటనలో వీరు ప్రయాణం చేస్తున్న కారును ధ్వంసం చేసి, వీరిద్దరినీ తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక షెడ్యూలు వచ్చింది మొదలు చంద్రబాబు ఆదేశాల మేరకు ఒక పథకం ప్రకారం కుట్రలు చేస్తూ, ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో హింసను రాజేస్తున్నారని ధ్వజమెత్తారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో శాంతిభద్రతలు దిగజారడంతోపాటు, పోలీసులు టీడీపీకి కొమ్ముకాయడం, ఉద్దేశపూర్వకంగా వ్యవస్థలను నీరుగార్చడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు జగన్ తెలిపారు.
‘ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. కళ్లుమూసుకుని తెరిచేసరికి మరో 3 ఏళ్లు అయిపోతాయి. ఆ తర్వాత మీరు చేసిన ఈ అన్యాయాలన్నీ, వడ్డీతో సహా మీకు చుట్టుకుంటాయని, ఇవాళ అన్యాయాలు చేస్తున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి అని ప్రజాస్వామ్యవాదిగా గట్టిగా హెచ్చరిస్తున్నా’ అని జగన్ పేర్కొన్నారు.









