Parents carry their infant in flooded streets of Prayagraj | ఉత్తరప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు నగరాలు జలమయం అయ్యాము. వీధుల్లో వరద చేరిపోడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
ఇదే సమయంలో తమ నవజాత శిశువు కోసం తల్లిదండ్రులు ఎన్నో అవస్థలు పడ్డారు. ప్రయాగ్రాజ్ లోని చోటా బఘాడా ప్రాంతంలోని వీధుల్లో పీకల్లోతు వరద వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఉన్న తమ శిశువును ఆసుపత్రికి తరలించేందుకు తల్లిదండ్రులు పీకల్లోతు వరదను సైతం లెక్కచేయలేదు.
అర చేతుల్లో శిశువును పైకి పట్టుకున్న తండ్రి వరదలోకి దిగి ముందుకు సాగాడు. భర్త ముందుకు నడుస్తుండగా భార్య సైతం వరదలోనే ఆసుపత్రికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కార్ పై విపక్షాలు విరుచుకుపడ్డాయి.
యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సదరు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బీజేపీ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ప్రయాగ్‌రాజ్‌లో రూ.20 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత, అక్కడి ప్రజలకు నీటి ముంపు తప్ప మరేమీ దక్కింది? అని నిలదీశారు.
భ్రష్టాచారం యొక్క లోతైన గుంతల్లో నీరు నిండి, బీజేపీ కుంభకోణాల దందాను బహిర్గతం చేశాయని పేర్కొన్నారు. ప్రయాగ్రాజ్ స్మార్ట్ సిటీ అని చాటింపు వేసుకున్న బీజేపీ నాయకులు ఇప్పుడు తమ తమ పడవలతో వరద నీటి గుండా ప్రయాణించి అదృశ్యమయ్యారని అఖిలేష్ యాదవ్ నిప్పులుచెరిగారు.









