Rahul Gandhi backs ‘dead economy’ remark on India | భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీగా మారిందని సంచలన ఆరోపణలు చేశారు లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అలాగే దేశ ఆర్థిక, రక్షణ, విదేశాంగ విధానం పూర్తిగా ధ్వంసం అయ్యిందన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తాజగా స్పందించారు. ట్రంప్ నిజాన్ని చెప్పినందుకు సంతోషిస్తున్నట్లు వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనం అయ్యిందని పేర్కొంటూ డెడ్ ఎకానమీగా అభివర్ణించారు.
కేవలం ఆదానికి సహాయం చేసేందుకు బీజేపీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీగా మారిందన్న విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు తప్ప మిగిలిన అందరికీ తెలుసన్నారు.
భారత్-పాకిస్థాన్ మధ్య తానే కాల్పుల విరమణ చేశానని ట్రంప్ చాటింపు వేసుకుంటున్నారని, అలాగే ఐదు యుద్ధ విమానాలు కూలిపోయాయని అమెరికా అధ్యక్షుడు అంటున్నారని పేర్కొన్నారు.
అలాగే ఇప్పుడు భారత్ పై ట్రంప్ 25శాతం సుంకాలు విధించారని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రధాని ట్రంప్ వ్యాఖ్యలపై, సుంకాలపై సమాధానం ఇవ్వడం లేదని నిలదీశారు.









