- రెసిడెన్స్ సర్టిఫికేట్ కోసం వింత దరఖాస్తులు!
Dogesh Babu Residence Certificate | బిహార్ (Bihar)లో వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల పట్నాలో డాగ్ బాబు పేరుతో ఒక కుక్క కు రెసిడెన్సీ సర్టిఫికేట్ కావలంటూ అప్లికేషన్ వచ్చిన విషయం తెలిసిందే.
అందులో కుక్క తండ్రి పేరు కుత్తా బాబు, తల్లి పేరు కుటియా దేవి అని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, తాజాగా నవాదా జిల్లా సిర్దాలా ప్రాంతంలో “డాగేశ్ బాబు” అనే పేరుతో మరో దరఖాస్తు వెలుగులోకి వచ్చింది.
ఈ దరఖాస్తులో కుక్క చిత్రంతో పాటు తల్లిదండ్రుల పేర్లు “డాగేశ్ కి మమ్మీ” మరియు “డాగేశ్ కే పాపా”గా ఉన్నాయి. ఇంకా తూర్పు చంపారన్ జిల్లాలో “సోనాలికా ట్రాక్టర్” అనే పేరుతో, ఒక భోజ్‌పురి నటి చిత్రంతో మరో దరఖాస్తు నమోదైంది.
ఈ మొత్తం వ్యవహారంపై అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. “డాగ్ బాబు” దరఖాస్తు మంజూరై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సంబంధిత ఇద్దరు అధికారులపై శాఖాపరంగా చర్యలు తీసుకున్నారు. నవాదా జిల్లా కలెక్టర్ రవి ప్రకాష్ ఈ సంఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, దీనిపై దర్యాప్తు ఆదేశించారు.
ప్రస్తుతం దరఖాస్తుదారుల పట్ల సైబర్ నిపుణుల సహాయంతో విచారణ జరుపుతున్నారు. బిహార్ రాష్ట్రంలో ‘రైట్ టు పబ్లిక్ సర్వీస్’ చట్టం ప్రకారం, ఆన్‌లైన్‌లో నివాస ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తు చేసుకోవచ్చు. దీన్ని ఆసరాగా తీసుకొని కొందరు ఆకతాయిలు ఇలా అప్లికేషన్లు పంపిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.









