Deputy Cm Pawan Kalyan | మాతృభాషకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ‘సమాజంలో మన గుర్తింపుకు మూలం మాతృభాష.
బాల్యంలో విద్యాభ్యాసానికి, మన సంస్కృతులను కాపాడుకోవడానికి మాతృభాష తప్పనిసరిగా ఉండాలి.’ అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు భిన్నత్వంలో ఏకత్వం – జాతీయ సమగ్రత, భాషా సామరస్యంపై పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం ఇది అంటూ జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
బహుభాషా ప్రావీణ్యం – జీవితంలో ఎదిగేందుకు సాధనంగా ఉపయోగపడుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. అన్ని భాషలను గౌరవించాలని చెప్పారు. ఏ భాషను బలవంతంగా రుద్దవద్దు – ప్రతీ భాషకు సముచిత గౌరవం ఇవ్వటం కనీస బాధ్యత, భాషను గౌరవిస్తూ అది ప్రజలను కలిపే వారధిగా పనిచేస్తుంది, బలవంతంగా భాషను రుద్దితే అది ప్రజలను విడదీస్తుందని తెలిపారు.
హిందీ బలవంతంగా రుద్దడం లేదు, కానీ హిందీ వల్ల ప్రయోజనాలు అనేకమని అభిప్రాయం వ్యక్తం చేశారు. హిందీ భాషను ఖచ్చితంగా నేర్చుకోవాలనే విధానానికి తాను ఎప్పుడూ వ్యతిరేకమేనని, అయితే ఉద్యోగ అవకాశాల కోసం, విభిన్న ప్రాంతాల ప్రజలతో మమేకం అయ్యేందుకు హిందీని నేర్చుకోవడం వల్ల ఫలితాలే తప్ప నష్టం ఏమీ లేదు అని పేర్కొన్నారు.
భాషా వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా భారతదేశం మరింత సమగ్రాభివృద్ధి సాధించేందుకు, ఫెడరల్ స్ఫూర్తి కాపాడేందుకు దోహదపడుతుందని పవన్ కళ్యాణ్ నొక్కిచెప్పారు.









