AP BJP President Madhav News | భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ ఇటీవల వివాదంలో చిక్కుకున్న విషయం తెల్సిందే.
మంత్రి నారా లోకేశ్ తో భేటీ సందర్భంగా ఆయన ‘భారత సాంస్కృతిక వైభవం’ పేరిట దేశ చిత్రపటాన్ని నారా లోకేశ్ కు బహుకరించారు. ఇందులో తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ ను కలిపి చూపడం వివాదంగా మారింది. తాజగా మాధవ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచందర్ రావుతో భేటీ అయ్యారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మ్యాపుతో కూడిన ‘భారత సాంస్కృతిక వైభవ’ చిత్ర పటాన్ని బహుకరించారు. ఈ నేపథ్యంలో మాధవ్ స్పందిస్తూ..“తెలుగు ఐక్యతపై రాజకీయ గీతలు వేసే వారు, చరిత్ర ముందు లొంగాల్సిందే” అని పేర్కొన్నారు.
ఓట్ల కోసం ఫోటోల్లో గీతలు గీసి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వారిని తెలుగు ప్రజలు ఎప్పటికీ జ్ఞాపకంలో ఉంచుకుంటారని.. తెలంగాణ , ఆంధ్ర ప్రజల మధ్య బంధాన్ని చీల్చే ప్రయత్నాలుసంకుచిత మనస్తత్వానికి నిదర్శనం మాత్రమేనని విమర్శించారు.
‘నేను ఒక జాతీయవాదిని. ఒక గర్వపడే తెలుగు వాడిని. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష, సంస్కృతి, గౌరవం కోసం శాసనమండలిలో శాసనాల్లో చురుకుగా పని చేసినవాడిని. తెలంగాణ పట్ల, ఆ గొప్ప సంస్కృతి పట్ల నాకు ఉన్న ప్రేమ, గౌరవం రాజకీయవిమర్శలకు అతీతం. రజాకార్లను పొగిడే, నిజాం వారసుల ముందు తల వంచినవారికి, తెలంగాణ ప్రజల హృదయాలలో ప్రతిఫలించే సంస్కృతి, జాతీయత, సమానత్వం అనే విలువలు ఎప్పటికీ అర్థం కావు. నాకు సోదర తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్న ప్రేమను, గౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు, మార్చలేరు.’ అని మాధవ్ స్పష్టం చేశారు.









