Bhu Bharati Portal News | తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి భూభారతి చట్టంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహణ చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
గత పది సంవత్సరాలలో రాష్ట్రంలో పేరుకుపోయిన భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆశయంతో గత నెల 14వ తేదీన భూభారతి చట్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించినట్లు తెలిపారు.
ప్రయోగాత్మకంగా గతనెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో మరియు మే 5వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఆయా మండలాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రయోగాత్మకంగా నిర్వహించిన మండలాల్లో ఇప్పటికే కొన్నింటిని పరిష్కరించడం జరిగిందన్నారు.
ఈనెల చివరినాటికి వీలైనంతవరకూ సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. పరిష్కరించలేని వాటికి ఎందుకు పరిష్కరించలేకపోతున్నామనే విషయాన్ని లిఖిత పూర్వకంగా దరఖాస్తుదారులకు తెలియజేయనున్నట్లు, ఎప్పటికీ పరిష్కారం కానివి ఉంటే, అసలు పరిష్కార యోగ్యం లేనివి అక్రమమైనవి ఉంటే అవి పరిష్కారం కావు అని చెప్పడం జరుగుతుందన్నారు.
అలాగే సాదాబైనామాలకు సంబంధించిన అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని కోర్టులో స్టే వెకేట్ అయిన వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపించనున్నట్లు హామీ ఇచ్చారు. భూ సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలి అనేది భూ భారతి చట్టం లక్ష్యమని వివరించారు.
గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వలన మొత్తం రెవెన్యూ సేవలు ప్రజలకు దూరమయ్యాయని విమర్శించారు. మొత్తం వ్యవస్ధను ప్రజలకు చేరువు చేసి వారికి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.









