Ys Jagan Latest News | ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఫైర్ అయ్యారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా? అంటూ సీఎంను జగన్ ప్రశ్నించారు.
అమెరికా టారిఫ్‌ల దెబ్బ ఒకటైతే, ఆపేరు చెప్పి టీడీపీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్ అయి రైతులను దోచుకుతింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు రోజుకూ ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని నిలదీశారు. ప్రభుత్వ స్థాయిలో ఒక రివ్యూ చేసి, గట్టి చర్యలు ఎందుకు తీసుకోవడంలేదన్నారు.
రైతులంతా గగ్గోలు పెడితే, మీడియా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తే కేంద్రానికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం? 100 కౌంట్ రొయ్యల ధర అకస్మాత్తుగా రూ.280 నుంచి దాదాపు రూ.200- 210కి పడిపోయిందని పేర్కొన్నారు.
ఈ ధరలు ఇంకా తగ్గుతున్నా, క్రాప్ హాలిడే తప్ప వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెడుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని జగన్ దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు.. ఇప్పటికైనా కళ్లు తెరవాలని వెంటనే రొయ్యలకు ధరలు ప్రకటించి, ధరల పతనాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
అమెరికా టారిఫ్‌ల పేరుతో రైతుల్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ టారిఫ్‌లు అన్నవి కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావని, ఇక ముందుకూడా ఇవి కొనసాగుతాయని తెలిపారు.