Sunita Williams says india looks amazing from space | అంతరిక్షం నుండి భారత్ అద్భుతంగా, అత్యద్భుతంగా కనిపించిందని వెల్లడించారు భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్.
సాంకేతిక సమస్యల కారణంగా సునీత విలియమ్స్ సుమారు తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఆమె మరియు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ భూమిని చేరుకున్నారు. ఈ క్రమంలో తాజగా నాసా ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వీరు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంతరిక్షం నుండి భారత్ ఎలా కనిపించిందని ప్రశ్నించగా, అద్భుతంగా కనిపించినట్లు సునీత చెప్పారు. హిమాలయ పర్వతాల మీదుగా వెళ్లిన ప్రతీసారి బుచ్ విల్మోర్ ఆ అందాలను తన కెమెరాలో బందించినట్లు తెలిపారు. తూర్పు వైపు నుంచి ముంబయి, గుజరాత్ మీదుగా వెళ్తున్నప్పుడు, సముద్రంలో ఉండే మత్యకారుల పడవలు తమకు సిగ్నల్స్ లాగే పనిచేశాయని గుర్తుచేసుకున్నారు.
హిమాలయాల సౌందర్యం అద్భుతమన్నారు. అలాగే త్వరలో తన తండ్రి పుట్టిన దేశానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కడ బంధువులు, ప్రజలతో ముచ్చటించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే అంతరిక్ష పరిశోధన, యాత్రలో భారత్ సాగిస్తున్న విజయాల పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కాగా సునీత విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు. అనంతరం అమెరికాకు వలస వెళ్లిపోయారు.









