KCR Comments On Chandrababu | రాబోయే రోజుల్లో బీఆరెస్ సింగిల్ గానే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మాజీ సీఎం, బీఆరెస్ అధినేత కేసీఆర్.
ఈ మేరకు శనివారం రామగుండం నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ లో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవారు కాదని, కానీ బీఆరెస్ మాత్రం సింగిల్ గానే గెలుస్తుందన్నారు. తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపారని, ఇందిరా గాంధీ తెలంగాణను మోసం చేశారని పేర్కొన్నారు.
మోదీ తన మెడపై కత్తి పెట్టినా వెనుకడుగు వేయలేదన్నారు. బెల్లం ఉన్న దగ్గరకే ఈగలు వస్తాయి, అలాగే సిరిసంపదలు ఉన్న తెలంగాణను దోచుకివడానికి కొందరు బయలుదేరారని గులాబీ అధినేత హాట్ కామెంట్స్ చేశారు. గత పదేళ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేని తెలంగాణ, ఇప్పుడు మాత్రం సమస్యల వలయంలో చిక్కుకుందన్నారు.
తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. నోటికొచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ప్రజల్ని మోసం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆరెస్ మాత్రమేనని కేసీఆర్ తెలిపారు.









