UCC Implemented In Uttarakhand | ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సోమవారం నుండి ఉమ్మడి పౌరస్మృతి ( Uniform Civil Code )అమల్లోకి వచ్చింది. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూసీసీని అమలు చేయడానికి పెద్ద ఎత్తున కసరత్తు చేసింది.
దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
యూసీసీ అమలుతో రాష్ట్రంలోని పౌరులందరకీ సమాన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని సీఎం తెలిపారు. మతాలతో సంబంధం లేకుండా ఉత్తరాఖండ్ లో లింగ సమానత్వం సాధించే విధంగా యూసీసీ దోహద పడుతుందని సీఎం వివరించారు.
యూసీసీ అమలు ద్వారా వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామ వంటి అంశాల్లో లింగ సమానత్వం సాధించేలా ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. మరోవైపు యూసీసీ అమలుతో సహా జీవనం చేస్తున్నవారు ఇకనుండి రిజిస్ట్రేషన్ చేసుకోవల్సిందే.
దీనికోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. అలాగే అన్ని మతాలకు చెందిన స్త్రీ, పురుషులకు వివాహ వయసు ఒకేలా ఉండనుంది. అంతేకాకుండా హలాల్ విధానంపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధం విధించింది.









