Cm Revanth Serious On Food Poison Incidents | తెలంగాణలోని పలు పాఠశాలలు, హాస్టళ్లలో వరుస ఫుడ్ పాయిజన్ ( Food Poison ) ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బందిపై సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థులను సొంత బిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అలక్ష్యానికి తావు ఇయ్యరాదని ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు.
బడి పిల్లలకు అందించే ఆహారానికి సంబంధించి ఘటనలు పునరావృతం కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. కలెక్టర్లు తరచూ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులాలను తనిఖీ చేసి, నివేదికలను సమర్పించాల్సిందే అని ఆదేశించారు.
విద్యార్థినీ విద్యార్థుల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కొందరు దురుద్దేశంతో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, లేనివి ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.