CM Revanth Inaugurates IIHT | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం నాంపల్లిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థులు ఇప్పటి వరకు IIHTలో చేరాలంటే ఒడిశా, ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు.
తెలంగాణలో ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు పదేళ్లుగా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ అంశం తమ దృష్టికి వచ్చిన వెంటనే ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.
“రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇనిస్టిట్యూట్ ఉండి తీరాలని ప్రధాని, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం స్పందించి ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ సంవత్సరమే ఇనిస్టిట్యూట్ మొదలుపెట్టాలని మేం అధికారులను ఆదేశించాం.
విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. వచ్చే ఏడాది నుంచి స్కిల్స్ యూనివర్సిటీలో IIHT భవనం ఉండేలా చర్యలు తీసుకుంటాం. నేత కార్మికుల కళ్లలో ఆనందం చూడాలని రూ.290 కోట్ల బకాయిలు విడుదల చేశాం.
గతంలో ఆర్భాటం, సినీ తారల తతళుకు బెళుకులు తప్ప నేతన్న ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలను చెల్లించకుండా ఆలస్యం చేసింది. కానీ మేం బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించి.. రాజకీయాలకు అతీతంగా సిరిసిల్ల కార్మికులను ఆదుకున్నాం.
రాష్ట్రంలో 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారు. ఏడాదికి ఒక్కో సభ్యురాలికి రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంచి డిజైన్, క్వాలిటీ తో ముందుకు రావాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.
ఏడాదికి దాదాపు కోటి 30 లక్షల చీరల ఆర్డర్ ను నేతన్నలకు ఇవ్వనున్నాం. సమాఖ్య సంఘాల ఎన్నికల నిర్వహణ విషయంలో కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశిస్తున్నా. రూ.30 కోట్లున్న చేనేత రుణాలు మాఫీ చేసి చేనేత కార్మికుల రుణ విముక్తులను చేస్తాం. రైతన్న ఎంత ముఖ్యమో మాకు నేతన్న కూడా అంతే ముఖ్యం. మీ సమస్యల పరిష్కారానికి మీ అన్నగా మీకు అండగా ఉంటా.
ఎలక్షన్, సెలెక్షన్, కలెక్షన్ చేసిన వారిది త్యాగం కాదు. తెలంగాణ కోసం పదవిని తృణప్రాయంగా వదిలేసిన కొండా లక్ష్మణ్ బాపూజీది అసలు సిసలైన త్యాగం. త్యాగానికి మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ. IIHT కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించిన జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా” అని ప్రసంగించారు సీఎం రేవంత్ రెడ్డి.