Seethakka Fires On KTR | తెలంగాణ మంత్రి సీతక్క (Minister Seethakka) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ మహిళలకు కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చు అని కేటీఆర్ అత్యంత జుగుప్సకరంగా మాట్లాడారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం, సంస్కారం ఇదేనా కేటీఆర్? మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్సులు చేస్తున్నారా..?” అంటూ కేటీఆర్‌ను సీతక్క నిలదీశారు.
ఆడవాళ్లంటే కేటీఆర్‌కు గౌరవం లేదని. మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. కేటీఆర్ భేషరతుగా తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆడవాళ్లను కించపరిచే విధంగా బ్రేక్ డాన్సులు చేసుకోండి అనడం ఆయన బుర్రలో ఉన్న బురదకు నిదర్శనమన్నారు సీతక్క.
మహిళలు ఆర్థికంగా ఎదగాలని.. ఆడవాళ్ల కోసం సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. అందులో భాగంగానే పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృథా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటని సీతక్క ప్రశ్నించారు.
“మహిళలు బ్రేక్ డాన్సులు చేసుకోండి అనే మాటలు మీ నోటికి ఎలా వచ్చాయి.. అంత ధైర్యం ఎలా వచ్చింది కేటీఆర్”.. అంటూ సీతక్క నిలదీశారు. మహిళల పట్ల అసభ్యకర మాటలు మాట్లాడిన కేటీఆర్ తీరును ఖండిస్తున్నానని తెలిపారు. కేటీఆర్ తక్షణమే తెలంగాణ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.