Indiramma Indlu Scheme| మార్చి 11 నుండి ఇందిరమ్మ ఇండ్ల ( Indiramma Indlu ) పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth ).
ఈ మేరకు శనివారం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబందించిన మార్గదర్శకాలపై రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి ( Ponuleti ), పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar ) తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అందుకు అనుగుణంగా విధి విధానాలను తయారు చేయాలని ఆదేశించారు.
ప్రజా పాలనలో నమోదు చేసుకున్న అర్హులందరికీ ముందుగా ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. ముందుగా ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేయాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు.
గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ( Double Bedroom ) ఇండ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా, అసలైన అర్హులకు లబ్ధి జరిగేలా చూడాలని అధికారులకు చెప్పారు సీఎం.