Ayodhya Ram Lalla Statue | శ్రీరామ జన్మభూమి అయోధ్య (Ayodhya)లో నిర్మిస్తున్న రామాలయం ఈ నెల 22న అత్యంత వైభవంగా ప్రారంభం అవబోతోంది. ఈ నేపథ్యంలో అయోధ్య రామాలయంలో ప్రతిష్టించనున్న బాల రాముడి విగ్రహం ఖరారైంది.
కర్ణాటకకు (Karnataka) చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj) తీర్చిదిద్దిన బాలరాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi) స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీనికి సంబంధించి ఫోటోను షేర్ చేశారు.
‘శ్రీరాముడు ఎక్కడ ఉంటాడో, హనుమంతుడు అక్కడ ఉంటాడు. అయోధ్యలోని రాముని విగ్రహ ప్రతిష్టాపన కోసం విగ్రహం ఎంపిక పూర్తియింది. ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టించనున్నారు.
రాముడు, హనుమంతునికి మధ్య ఉన్న అవినాభావ సంబంధానికి ఇది మరో ఉదాహరణ. హనుమంతుని జన్మభూమి అయిన కర్ణాటక నుంచి శ్రీరాముని సేవా కార్యం జరిగిందనడంలో సందేహం లేదు.’ అని తన పోస్టులో రాసుకొచ్చారు మంత్రి.
12 నాణ్యమైన శిలల పరిశీలన..
అయోధ్య రామాలయ ట్రస్ట్ శ్రీరాముని విగ్రహ రూపకల్పనకు నేపాల్ లోని గండకీ నదితో పాటు కర్ణాటక, రాజస్థాన్, ఒడిశా నుంచి మొత్తం 12 నాణ్యమైన రాళ్లను గుర్తించింది. అయితే, రాజస్థాన్, కర్ణాటక రాళ్లే విగ్రహ తయారీకి అనువుగా ఉన్నట్లు తేల్చింది.
కర్ణాటకలో లభించిన శ్యామశిల, రాజస్థాన్ లోని మక్రానాకు చెందిన మార్బుల్ రాక్ లను ఎంపిక చేశారు. విశిష్టమైన ఈ శిలలు, నీటి నిరోధకత కలిగి ఉండడం సహా, సుదీర్ఘ జీవిత కాలాన్ని కూడా కలిగి ఉంటాయి.
కాగా, అయోధ్యలో నెలకొనే రాముని విగ్రహ ఎంపిక కోసం డిసెంబర్ 30న ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రకు చెందిన బోర్డు ట్రస్టీలు ‘రామ్ లల్లా’ విగ్రహాలను పరిశీలించారు. పోటీలోని 3 విగ్రహాలను పరిశీలించి తమ నిర్ణయాన్ని లిఖిత పూర్వకంగా ట్రస్టుకు సమర్పించారు.
కర్ణాటక నుంచే మరో శిల్పి గణేశ్ భట్, రాజస్థాన్ నుంచి సత్యనారాయణ పాండేలు కూడా పోటీలో నిలిచారు. ముంబయికి చెందిన ఆర్టిస్ట్ వసుదేవ్ కామత్ ఇచ్చిన స్కెచ్ ల ఆధారంగా ‘రామ్ లల్లా’ను డిజైన్ చేశారు. చివరికి కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పాన్ని ప్రాణ ప్రతిష్టకు ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.