- శుక్రవారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ‘హైలెవల్ పొలిటికల్ ఫోరమ్’ (HLPF) వేదికగా కిషన్ రెడ్డి ప్రసంగం
- HLPF వేదికగా ప్రసంగించనున్న తొలి భారత పర్యాటక శాఖ మంత్రిగా అరుదైన గౌరవం
- జీ-20 టూరిజం చైర్ హోదాలో హాజరుకానున్న కేంద్రమంత్రి
- అమెరికాలోని భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న కార్యక్రమంలో పాల్గొననున్న కిషన్‌రెడ్డి
- అటునుంచే లండన్‌కు ప్రయాణం.. 19వ తేదీ ఉదయం ఢిల్లీకి రాక
Rare Honour To KishanReddy | అమెరికాలోని న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ (HLPF) సమావేశాల్లో ప్రసంగించేందుకు గౌరవ కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు.
అమెరికా కాలమానం ప్రకారం 14వ తేదీ మధ్యాహ్నం 1.15 నుంచి UNWTO (ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ HLPF సమావేశాల్లో ఆయన పాల్గొంటారు.
ఈ సమావేశాలకు ఆహ్వానం అందుకున్న మొదటి భారత పర్యాటక మంత్రిగా అరుదైన గౌరవాన్ని అందుకున్న కిషన్ రెడ్డి ‘జీ-20 టూరిజం చైర్’ హోదాలో ఈ అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనబోతునున్నారు.
ఇటీవలే గోవాలో జరిగిన జీ-20 దేశాల పర్యాటక మంత్రుల సమావేశాలు విజయవంతంగా జరగడం, ‘గోవా రోడ్‌మ్యాప్’ రూపంలో భారతదేశం చేసిన ప్రతిపాదనలకు సభ్యదేశాలు, ఆతిథ్యదేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ‘పర్యాటక రంగంలో సుస్థిరాభివృద్ధి లక్షాలను చేరుకోవడం; అత్యవసర కార్యాచరణ కోసం దేశాలను, వివిధ భాగస్వామ్య పక్షాలను (వ్యాపార సంస్థలు) ఏకం చేయాల్సిన ఆవశ్యకత’ థీమ్ తో ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
ఇందులో ప్రపంచంలోని వివిధ దేశాల ప్రతినిధులు, బడా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి కిషన్‌రెడ్డి ప్రసంగించనున్నారు.
అమెరికా పర్యటన సందర్భంగా 14, 15 తేదీల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. పలు చారిత్రక మ్యూజియంలను సందర్శించనున్నారు. పలు పర్యాటక రంగ సంస్థల ప్రతినిధులతో చర్చిచనున్నారు.
భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అమెరికాలో ఉంటున్న భారత సంతతి ప్రజలు, ప్రముఖులతో నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొని, ప్రసంగిస్తారు.
అనంతరం ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ సమావేశంలోనూ కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.
అక్కడి నుంచి లండన్ బయలుదేరి వెళ్లనున్న కేంద్రమంత్రి.. తిరిగి 19వ తేదీ ఉదయం ఢిల్లీ చేరుకోనున్నారు.