Rajaiah VS Kadiyam | స్టేషన్ ఘనపూర్ బీఆరెస్ పార్టీ (BRS Party)లో నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి.
తాజాగా ఇరువురి మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు.
తాజాగా ఎమ్మెల్యే రాజయ్య రాజకీయంగానే కాకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తూ బీఆరెఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు.
గత కొంతకాలంగా నియోజకవర్గంలోని జానకీపురం సర్పంచ్ నవ్య చేస్తున్న ఆరోపణలతో వార్తల్లో నిలిచిన రాజయ్య ఇప్పుడు కడియం శ్రీహరి పైన చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు.
ఈ ఇరువురు నేతలు ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం టికెట్ ను ఆశిస్తున్నారు. అలాగే ఇద్దరు నేతలు నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారాన్ని మొదలుపెట్టారు.
ప్రస్తుత స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య తన సొంత ఇలాకాలో కడియం శ్రీహరి (Kadiyam Srihari) రాజకీయాలు చేస్తుండటం పట్ల బహిరంగంగా అసహనాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
ఇప్పుడు ఈ ఇద్దరి నేతల మధ్య వైరం తారాస్థాయికి చేరుకుంది.
జనగామ జిల్లా జఫర్ గడ్ మండలంలోని హిమ్మతనగర్ లో ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అవీనీతి తిమింగలం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాలలోకి రాకముందుకు కడియం శ్రీహరి ఇంటి కిటికీలకు గొనె సంచులు ఉండేవని కానీ ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయని ఆరోపించారు.
టీడీపీ హయంలో మంత్రిగా ఉన్నప్పుడు చాలా అవినీతికి పాల్పడి సింగపూర్, మలేసియా దేశాల్లో ఆస్తులు కూడబెట్టారని విమర్శించారు.
కానీ తాను మాత్రం ఆస్తులు అమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేశానని రాజయ్య తెలిపారు.
ఆస్తులు అమ్ముకున్న చరిత్ర తనది అయితే కూడబెట్టిన చరిత్ర ఆయనదంటూ అని కడియం శ్రీహరిని ఉద్దేశించి ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కడియం చేసిన అవినీతి గురించి ఒక పుస్తకం కూడా ఉందని దానిని అతిత్వరలో విడుదల చేస్తానని తెలిపారు.
“పర్వతగిరి నుండి వచ్చి ఇక్కడ రాజకీయాలు చెయ్యాలని కడియం ప్రయత్నిస్తున్నారు కానీ ఇక్కడి ప్రజలు కడియం శ్రీహరి ఊసరవల్లి మాటలు నమ్మరని రాజయ్య అన్నారు.
నియోజకవర్గంలో ఎక్కడపడితే అక్కడ మీటింగ్ లు పెడుతున్నావు. కానీ ప్రజలు నిన్ను నమ్మరు అలాగే నీ వెంట ఉన్న వారు అందరూ బీఆరెఎస్ పార్టీ నుండి బహిష్కరించబడినవారు.
నువ్వు అసలైన బీఆరెఎస్ నాయకుడివే అయితే రచ్చబండ వద్ద చర్చకు రా” అని సవాల్ విసిరారు రాజయ్య.
ఇకనుండి ప్రతిరోజు నియోజకవర్గంలో పర్యటిస్తానని, కడియం అవీనీతి గురించి ప్రతి ఊరిలో డప్పు కొడుతూ ప్రచారం చేస్తానని ఎమ్మెల్యే రాజయ్య తీవ్రంగా మండిపడ్డారు.
“ఓటర్లకు పైసలు ఇచ్చి గెలిచే రోజులు పోయాయి. నియోజకవర్గంలో నాలా పరుగెత్తాలంటే నీ గుండె ఆగిపోతుంది.
ప్రతిపక్షాల పప్పులు ఉడక్కుండా చేసిన మొండి కేసీఆర్ అయితే.. అంతకు మించిన జగమొండిని నేను.
అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ రోజు కూడా కొబ్బరికాయ కొట్టని నేతలు కూడా అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారు.
20 ఏళ్లుగా నియోజకవర్గానికి, ప్రజలకు దూరమై.. వ్యక్తిగత ఆస్తులను పెంచుకుంటూ రాజకీయాన్ని వ్యక్తిగతంగా వాడుకుంటున్నావు” అంటూ కడియంపై రాజయ్య విరుచుకుపడ్డారు.
ఇలా నాయకుల ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రచ్చకెక్కుతున్నారు. కానీ వీరిద్దరి వ్యవహారం పై అధిష్టానం మౌనంగా ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.