BJP MLA Raghunandan Rao | అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలంగాణ బీజేపీ (Telangana BJP) సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్టీలో పదవుల పోరు నడుస్తోంది.
బీజేపీలో కీలక నేతలు ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్నారు.
పార్టీ అధ్యక్ష మార్పు జరగుతుందని కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)కి అధిష్టానం నుంచి పిలుపొచ్చింది.
ఇక పార్టీ అధ్యక్షుడి మార్పు ఖాయమనే సూచనలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ పగ్గాలపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి పదవికి తానెందుకు అర్హుడిని కానని ప్రశ్నించారు రఘునందన్. గత 10 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తాను పదవులకు అర్హున్ని ఎందుకు కానని పేర్కొన్నారు.
పార్టీకి ఇంత కృషి చేసిన తనకు పదవులు ఎందుకు ఇవ్వరని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపంగా మారిందని అభిప్రాయపడ్డారు.
దుబ్బాక ఉపఎన్నికల్లో తనకు ఎవరు సహాయం చేయలేదని, తానే సొంతంగా గెలిచానని అన్నారు.
మునుగోడు ఎన్నికల్లో రూ.100కోట్లు ఖర్చు చేశారన్న రఘునందన్ (Raghunandan Rao), అవే డబ్బులు తనకు ఇస్తే తెలంగాణను దున్నేసేవాడినని అని ఆయన తెలిపారు.
రెండు నెలల్లొ బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందన్నారు. దుబ్బాక నుంచి రెండోసారీ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
బండి సంజయ్ ది స్వయంకృతాపరాధం..
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పుపై వస్తున్న వార్తలపై స్పందించారు రఘునందన్ రావు. ఆ వార్తలన్నీ నిజమేనని తెలిపారు. బండి సంజయ్ ది స్వయంకృతాపరాధం అని వ్యాఖ్యానించారు.
ఆయన గత ఎన్నికల్లో పుస్తెలమ్మి పోటీ చేస్తే, నేడు వంద కోట్లతో ప్రకటనలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
ఏదో ఒక పదవి ఇవ్వండి..
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) పార్టీ నుండి సస్పెండ్ అయ్యాక బీజేపీ శాసనసభా పక్ష నేత (FLOOR LEADER) స్థానం ఖాళీగా ఉంది.
ఆ స్థానాన్ని అయిన తనకు ఇవ్వాలని రఘునందన్ కోరుతున్నట్లు సమాచారం.
లేదా కనీసం జాతీయ అధికార ప్రతినిధిగా అయిన తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ అగ్ర నేతలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.