29 Naxal-hit Chhattisgarh villages hoist Tricolour for 1st time since independence | 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో శుక్రవారం తొలిసారి జాతీయ పతాకం రెపరెపలాడింది.
స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుండి ఈ ప్రాంతం మావోయిస్టులకు కేంద్రంగా ఉంది. ఇక్కడ మావోయిస్టుల సమాంతర పాలన నడుస్తుంది. బస్తర్ డివిజన్‌లోని 29 కీకారణ్య గ్రామాల్లో తొలిసారిగా జాతీయ పతాకం ఎగిరింది.
ఈ గ్రామాలు బీజాపూర్, సుక్మా, దంతెవాడ, కాంకేర్, నారాయణ్‌పూర్, కొండగావ్, మరియు బస్తర్ జిల్లాల్లో ఉన్నాయి. ఇటీవల భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్ కగార్ ద్వారా ఈ గ్రామాల్లో భద్రతా శిబిరాలు ఏర్పాటు చేయడం వల్ల స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించడం సాధ్యమైంది.
ఆపరేషన్ కగార్ లో భాగంగా, ప్రతి 2-3 కిలోమీటర్లకు ఒక భద్రతా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరాలు గ్రామాల్లో జాతీయ పతాకం ఎగరవేయడానికి మరియు స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి వేడుకలను నిర్వహించడానికి దోహదపడ్డాయి.
బస్తర్ ప్రాంతం దేశంలో అత్యంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ఒకటిగా ఉంది, ఈ గ్రామాల్లో జాతీయ పతాకం ఎగరడం అనేది భారత ప్రభుత్వం యొక్క పరిపాలనా నియంత్రణను మరియు శాంతి స్థాపనను సూచిస్తుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.









