Woman Excise Constable Attacked by Smugglers at Nizamabad | నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను, ఆమె కుటుంబ సభ్యులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం ఉదయం పరామర్శించారు. సౌమ్య ఆరోగ్య స్థితిని వైద్యులు మంత్రికి వివరించారు. సౌమ్యకు ఇలా జరగడం అత్యంత దురదృష్టకరమని మంత్రి పేర్కొన్నారు. ధైర్యంగా ఉండాలని, సౌమ్య పూర్తిగా కోలుకుంటుందని కుటుంబ సభ్యులను ఓదార్చారు. సౌమ్య పూర్తిగా కోలుకునే వరకూ మెరుగైన వైద్య సేవలు అందించే బాధ్యత తమదేనన్నారు. సౌమ్యను పరామర్శించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఎక్సైజ్, పోలీస్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని వివరించారు. ఈ క్రమంలో నిజామాబాద్‌లో జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమని ఇందులు కారకులైన ప్రతి ఒక్కరినీ చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. విధి నిర్వాహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని నిందితులపై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు మంత్రి వెల్లడించారు.









