Viral News | ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాలనే తన చిరకాల కలను సాకారం చేసుకునేందుకు ఓ యువకుడు అత్యంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. దివ్యంగుల కోటాలో సీటు సులభంగా వస్తుందని భావించిన అతడు ఏకంగా తన కాలు పాదాన్ని నరుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. యూపీలోని జౌన్ పూర్ కు చెందిన 20 ఏళ్ల సూరజ్ భాస్కర్ నీట్ పరీక్షకు సన్నద్ధం అవుతున్నాడు. ఇప్పటికే రెండు సార్లు అర్హత సాధించలేకపోయాడు. అయితే తాజాగా అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో తన తమ్ముడిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి కాలు పాదం నరికేసి వెళ్లిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు సూరజ్ భాస్కర్ సోదరుడు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బయటి వ్యక్తులు దాడి చేసి వెళ్లిపోయినట్లు ఆధారాలు లభించలేదు. మరోవైపు దర్యాప్తులో సూరజ్ భాస్కర్ పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు భాస్కర్ డైరీని పరిశీలించారు. అందులో ‘నేను 2026లో డాక్టర్ అవుతా’ అని రాసి ఉంది. అనుమానం వచ్చి భాస్కర్ ని ప్రశ్నించగా అసలు నిజం బయటపడింది. దివ్యంగుల కోటాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించాలనే తన కాలుని తానే నరుక్కునట్లు ఒప్పుకున్నాడు. దింతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సెక్షన్లు వర్తిస్తాయి అనే అంశంపై ప్రస్తుతం పోలీసులు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.









