Vinutha Kotaa News | శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత కోటా హత్య ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యారు.
మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతి కేసులో వినుత కోటాతో పాటు ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురిని చెన్నై పోలీసులు అరెస్టు చేస్తున్నారు. చెన్నై లోని మింట్ పోలీసు స్టేషన్ పరిధిలోని కూవం నదులో మూడు రోజుల కిందట ఓ మృతదేహాన్ని గుర్తించారు.
అనంతరం విచారణ చేపట్టగా ఆ మృతదేహం వినుత కోటా వద్ద డ్రైవర్ గా మరియు ఆమె వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన రాయుడిది అని నిర్ధారించారు. ఈ నెల 8న హత్య చేసి అతడి మృతదేహాన్ని నదిలో పడేసినట్లు విచారణలో భాగంగా తేలినట్లు కథనాలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబును మరియు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ స్పందించింది. వినుతను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఆమెపై హత్య కేసు ఆరోపణలు పార్టీ దృష్టికి వచ్చినట్లు జనసేన పేర్కొంది. ఇదిలా ఉండగా గతనెల 21న కోటా వినుత ఒక ప్రకటన చేశారు. డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు చేసిన ద్రోహానికి అతన్ని విధుల్లో నుంచి తొలగించినట్లు ప్రకటించడం గమనార్హం.