– రైల్వేపై రూ. 9 లక్షల జరిమానా!
Rs 9 Lack Fine For Indian Railways | రైలు ఆలస్యం కారణంగా నీట్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) రాయలేకపోయిన విద్యార్థినికి ఏడేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత న్యాయం జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ (Basti) జిల్లా వినియోగదారుల కమిషన్, భారత రైల్వేలపై రూ.9 లక్షల పరిహారం విధించింది. అదనంగా కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ.10,000 చెల్లించాలని ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే.. బస్తీ జిల్లా గాంధీ నగర్ పికౌరా బక్ష్‌కు చెందిన సమృద్ధి సింగ్ (Samruddhi Singh), 2018 మే 7న లక్నోలోని జై నారాయణ్ పీజీ కళాశాలలో నిర్వహించిన నీట్ (NEET) పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటర్సిటీ సూపర్‌ఫాస్ట్ రైలులో టికెట్ బుక్ చేసుకుంది.
ఉదయం 11 గంటలకు చార్బాగ్ చేరాల్సిన రైలు, మధ్యాహ్నం 1:34కు చేరడంతో ఆమె పరీక్షను కోల్పోయింది. ఫలితంగా ఒక విద్యా సంవత్సరం నష్టం వాటిల్లింది.
రైల్వే అధికారులకు పంపిన నోటీసులకు స్పందన లేకపోవడంతో ఆమె జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది.
విచారణలో ఆలస్యం జరిగినట్టు రైల్వేలు అంగీకరించినా సరైన కారణాలు చూపలేకపోయాయి. 45 రోజుల్లోగా మొత్తం రూ.9.10 లక్షలు చెల్లించాలని, ఆలస్యం అయితే 12 శాతం వడ్డీ వర్తిస్తుందని కమిషన్ స్పష్టం చేసింది.










