TPCC Chief Mahesh Goud | కాంగ్రెస్ నేతలు తనను వ్యక్తిత్వ హననం చేస్తున్నారని కేటీఆర్ అనడం హాస్యాస్పదమని కొట్టిపారేశారు టీపీసీసీ నేత మహేశ్ కుమార్. శుక్రవారం ఆయన ఫోన్ ట్యాపింగ్ అంశంపై మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ కేసులో రాజ్యాంగం ప్రకారం విచారణ కొనసాగుతోందన్నారు.
రాజకీయ కక్ష్య సాధింపు ధోరణి ఉంటే అధికారంలోకి రాగానే చర్యలు ఉండేవన్నారు. ఇప్పటికైనా ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ వినడం వ్యక్తిగత స్వేచ్ఛ కు భంగం కలిగించినట్లేనని అభిప్రాయపడ్డారు.
బిఆర్ఎస్ హయంలో కేవలం మూడు నెలల్లో 547 ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించారు.తన మిత్రుడి ఫోన్ సైతం ట్యాప్ అయ్యిందని చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. బట్ట కాల్చి మీద వేసి పారిపోతామంటే కుదరదని హెచ్చరించారు.
అలీ బాబా 420 దొంగల మాదిరి కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని చేసిందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దీపం ఆగిపోకుండా ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం అంటూ కేటీఆర్ రాగాలు తీస్తున్నారని ఎద్దేవా చేశారు.
‘తోడ బుట్టిన చెల్లెలు కవిత ఫోన్ ట్యాప్ చేశారని గగ్గోలు పెడుతుంటే సమాధానం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రమైంది. దీన్ని ఉద్యమ కేసులతో పోల్చడం సరికాదు. కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ కుటుంబం పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ ను సూటిగా అడుగుతున్నా.
బీజేపీ నేతల ఈడి కేసులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి? దేశ భద్రతకు విఘాతం కలిగించే శక్తులపై మాత్రమే ట్యాపింగ్ చేస్తారు? నక్సలైట్లతో లావాదేవీలు జరుపుతున్నారని నాపై నిఘా పెట్టీ ట్యాపింగ్ చేశారు. సినీ తారల ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది?
కవితను చెల్లెలుగా ఎప్పుడు గౌరవిస్తా. కేసీఆర్ కుటుంబంలో తగాదాలకు మూలం వాటాల పంపకంలో తేడా. కవిత ఇప్పటికైన నిజాలు మాట్లాడుతున్నాందుకు స్వాగతిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు మహేశ్ కుమార్ గౌడ్.









