Bandla Ganesh Meets Bhatti Vikramarka | ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ (Bandla Ganesh) మళ్లీ రాజకీయాలపై కన్నేసినట్లు తెలుస్తోంది.
2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరిన బండ్ల గణేశ్ అ సమయంలో కొన్ని సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యారు.
ఆ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ టికెట్ రాకపోవడంతో ఆశాభంగానికి గురయ్యారు. అయినప్పటికీ పార్టీకి కట్టుబడి ఎన్నికల సమయంలో పనిచేశారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పక గెలుస్తుందని, ఒక వేళ తమ ప్రభుత్వం రాకపోతే బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని చెప్పి వార్తల్లో నిలిచారు.
అప్పుడు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఎన్నికల అనంతరం పార్టీ ఓటమితో బండ్ల గణేశ్ వ్యాఖ్యలు మరింత వైరల్ అయ్యాయి.
అనంతరం కొన్ని రోజుల తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. తాజాగా మరోసారి తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.
భట్టి పీపుల్స్ మార్చ్ యాత్రలో బండ్ల..
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చేపడుతున్న పీపుల్స్ మార్చ్ (People’s March Padayatra) పాదయాత్ర ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొనసాగుతోంది.
అందులో భాగంగా ఆదివారం సూర్యాపేట చేరుకుంది. బండ్ల గణేశ్ పీపుల్స్ మార్చ్ యాత్రలో పాల్గొన్నారు. (Bandla Ganesh Meets Bhatti Vikramarka)
భట్టికి సంఘాభావం తెలిపారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తుఫాన్ మొదలయ్యిందన్నారు. ఆ తుఫాన్ ప్రభావం తో తెలంగాణ లో కూడా కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
“తెలంగాణ రాష్ట్రం మా వల్లనే వచ్చింది అని కొందరు చెప్పుకొంటున్నారు. కానీ తెలంగాణ వచ్చింది అంటే అది కేవలం సోనియా గాంధీ గారి వల్లనే సాధ్యం అయ్యింది” అని వ్యాఖ్యానించారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలో, భట్టి విక్రమార్క నేతృత్వంలో పార్టీ గెలుపు సాధిస్తుందని జోస్యం చెప్పారు. ప్రస్తుతం పార్టీలో నేతలందరూ ఐక్యంగా పనిచేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.
మరి ఈసారైనా పార్టీ నుంచి టికెట్ లభిస్తుందా.. లేదా గత ఎన్నిక మాదిరిగానే హడావుడి చేసి నిరాశకు గురవుతారా.. అనేది అతి త్వరలో తెలుస్తుంది.