Singer Sai Chand Death | తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాటలతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన గొంతు ఇప్పుడు మూగబోయింది.
ప్రముఖ గాయకుడు, బీఆరెస్ నేత, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మైన్ సాయి చంద్ (39) (Sai Chand) నిన్న రాత్రి గుండెపోటు తో మరణించారు.
సాయి చంద్ (39) బుధవారం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫార్మహౌస్ కి వెళ్లారు.
బుధవారం అర్ధరాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే సాయి చంద్ ని కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్ ఆసుపత్రి కి తీసుకెళ్లారు.
గుండెపోటు అని నిర్దారించిన వైద్యులు హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో కేర్ ఆసుపత్రి కి తరలించారు. ఆయనని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు.
సాయిచంద్ మరణవార్త విన్న బీఆరెస్ నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు.
పలువురు బీఆరెస్ నేతలు ఆసుపత్రి లో సాయిచంద్ మృతదేహానికి నివాళులు అర్పించారు.
సాయి చంద్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంతాపాన్ని ప్రకటించారు.
ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని, కళాకారున్ని కోల్పోయిందన్నారు. సీఎం కేసీఆర్ సహా మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తదితరులు సాయి చంద్ భౌతిక కాయానికి నివాళి అర్పించారు.
మలి దశ ఉద్యమాన్ని ఊర్రూతలూగించిన సాయిచంద్..
సాయి చంద్ 1984 సెప్టెంబర్ 20న వనపర్తి జిల్లా అమరచింతలో జన్మించారు. పీజీ వరకు చదువుకున్న ఆయన.. విద్యార్థి దశ నుంచి కళాకారుడు, గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
తెలంగాణ మలి దశ ఉద్యమంలో తన పాటలతో యువతను చైతన్యవంతం చేశారు. ఆట, పాటలతో ఉద్యమ స్ఫూర్తి నింపిన యువగానం ఇలా మౌనంగా నిష్క్రమించడం అందరిలోను దిగ్భ్రాంతిని మిగిలించింది.