Telangana Assembly | తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ (BRS) నుంచి గెలిచి కాంగ్రెస్ (Congress) లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ శాసనసభ కార్యదర్శి మంగళవారం నోటీసులు పంపించారు.
పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది? పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా? అనే అంశాలపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. కాగా, పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరపనుంది.