Supreme Court Comments On Divorce Cases | భార్యాభర్తల మధ్య తలెత్తే వివాదాలకు కోర్టులే వేదికలుగా మారుతున్నాయా? అంటూ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వైవాహిక సమస్యలను పరిష్కరించుకునేందుకు న్యాయస్థానాలను వ్యక్తిగత ప్రతీకారాలకు ఉపయోగించుకోవడం సరికాదని స్పష్టం చేసింది.
కోర్టుల్లో ఆరోపణలు–ప్రత్యారోపణలతో కేసులను క్లిష్టతరం చేయడం వల్ల సమస్య మరింత ముదిరిపోతుందని వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితుల్లో త్వరితగతిన పరిష్కారానికి మధ్యవర్తిత్వం అత్యంత ఉపయోగకరమని సూచించింది. ఈ విధానంతో అనేక వివాదాల్లో సానుకూల ఫలితాలు సాధ్యమవుతున్నాయని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
వివాహానంతరం కేవలం 65 రోజులే కలిసి జీవించి, దాదాపు పదేళ్లుగా వేర్వేరుగా ఉంటున్న దంపతుల కేసు విచారణలో భాగంగా జస్టిస్ రాజేశ్ బిందల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వివాహ బంధం పూర్తిగా చెదిరిపోయిందని పేర్కొంటూ, రాజ్యాంగ ఆర్టికల్ 142 ప్రకారం విడాకులు మంజూరు చేసింది.
ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ వైవాహిక వివాదాల్లో సమస్య పరిష్కారానికి బదులుగా ఒకరినొకరు ఎలా నష్టపరచాలనే దానిపైనే దృష్టి పెడుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. కృత్రిమ మేధ వంటి సాంకేతికతలతో తప్పుడు ఆధారాలు సృష్టించే ధోరణి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ, కోర్టులను ఆశ్రయించే ముందు కుటుంబాలు, పెద్దల సహకారంతో పరిష్కార మార్గాలు అన్వేషించాలని సూచించింది.









