Superstar Rajinikanth | సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సాధారణ జీవితం గడుపుతుంటారు. అంతేకాకుండా ఆయన తన స్నేహితులకు ఎంతో విలువ ఇస్తారు. వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వారిని కలుస్తుంటారు.
తాజాగా ఆయన తన స్నేహితుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కోయంబత్తూరు లోని అగ్రకల్చర్ యూనివర్సిటీలో 1975-79 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం మంగళవారం వర్సిటీ క్యాంపస్‌లోని అన్నా ఆడిటోరియంలో జరిగింది.
సుమారు 45 ఏళ్ల తర్వాత జరిగిన ఈ కార్యక్రమానికి వంద మందికి పైగా పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్ హాజరు కాలేకపోయినా, ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపారు.
“నేను ఎంత బిజీగా ఉన్నా, ప్రతి ఆరు నెలలకు ఒకసారి బెంగళూరు వెళ్తాను. అక్కడ నాతో పాటు డ్రైవర్లుగా, కండక్టర్లుగా పనిచేసిన నా పాత స్నేహితులను కలుస్తాను. నా అసలు పేరు శివాజీని నేను దాదాపు మర్చిపోయాను. కానీ నా స్నేహితులు నన్ను ఆప్యాయంగా ‘శివాజీ’ అని పిలిచినప్పుడు కలిగే ఆనందం వర్ణించలేనిది” అని ఆయన అన్నారు.









